టిఆర్టిఎఫ్ డైరీ- 2026ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ లోని ఆయన నివాసంలో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) నూతన సంవత్సర డైరీలను ఆవిష్కరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీటీఎఫ్ గా, రాష్ట్ర అవతరణ అనంతరం టీఆర్టీఎఫ్ గా మొత్తంగా ఉపాధ్యాయ మరియు విద్యారంగ సేవలో 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీఆర్టీఎఫ్ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ, జిల్లాలోని ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన, సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవుతాయని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తుందని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల కోరిక మేరకు ఫ్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించామని, నియోజకవర్గ కేంద్రాలలో కార్పొరేట్ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి, టీఆర్టీఎఫ్ సంఘానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నాడు. ఉపాధ్యాయులు సైతం ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా వృత్తి పట్ల పునరంకితమై పనిచేయాలని అన్నారు. అదేవిధంగా 10వ తరగతి పరీక్షల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్టిఎఫ్ రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయన్న గారి నారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పోతుగంటి రమేష్, టిఆర్టిఎఫ్ నాయకులు మహేశుని లక్ష్మీనారాయణ, గాజంగి విష్ణు, మామిడాల రమేష్, సుల్తాన్ రాజు, గోలి రాధకిషన్, గుగులోతు రమేష్ నాయక్, బూట్ల శ్రీనివాస్, ఇప్పకాయల ప్రకాష్, లక్కే లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.