మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి కలెక్టర్ పమేలా సత్పతి
మహిళలు తమ ఆత్మ గౌరవం కాపాడుకుంటూ అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ కళాభారతిలో డెమోక్రటిక్ సంఘ ఆధ్వర్యంలో జిల్లాలోని పలువురు మహిళా వార్డు సభ్యులకు సన్మానం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా కలెక్టర్, డెమొక్రటిక్ సంఘ కో ఫౌండర్, సినీనటి రెజీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుమారు 10 ఏళ్లుగా రాష్ట్రంలో పనిచేస్తున్నానని.. మహిళా పాలకులు ఉన్నచోట ప్రజా సమస్యలు తగ్గుముఖం పడుతున్నట్లు పేర్కొన్నారు.ఫౌండేషన్ సాయంతో మహిళలు ఎన్నికల్లో పోటీ చేసే విజయం సాధించడం అభినందనీయమని.. భవిష్యత్తులో మరిన్ని ఆకాంక్షలు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. అందరితో గౌరవంగా మెలుగుతూ ప్రజల కోసం కష్టపడి పనిచేస్తే మంచి పేరు దనంతట అదే వస్తుందని వివరించారు.తమ్ముడు, భర్త, తండ్రి, కుమారుడు చెప్పినట్లు చేయకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని మహిళా వార్డు సభ్యులకు సూచించారు. సినీ హీరోయిన్, డెమొక్రటిక్ సంఘ కోపౌండర్ రెజీనా కసాండ్రా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత మహిళల్లో అసాధారణ శక్తి ఉంటుందని.. సద్వినియోగం చేసుకుంటే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని పేర్కొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి మహిళల ఆలోచనలు విన్నట్లు వివరించారు.గ్రామీణ ప్రాంత మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో 25 మంది మహిళలకు ప్రోత్సాహం అందించగా.. 18 మంది నామినేషన్ దాఖలు చేశారని.. ఇందులో 11 మంది మహిళలు వార్డు సభ్యులుగా ఎన్నికైనట్లు ఫౌండేషన్ సభ్యులు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.