Banner
Watermark
వైఎస్ఆర్ కాలనీలో ప్రతి ఇంటికి విద్యుత్ మీటర్, ఇంటి పన్ను ధృవీకరణ పత్రం అందించాలి
📅 24 October 2026, 04:05 PM ✍️ admin
ఖమ్మం, అక్టోబర్- 24: నాణ్యతా ప్రమాణాలతో మూడు నెలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు.

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ వైఎస్ఆర్ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్)లో సుడా నిధులు రూ.1.30 కోట్లతో చేపట్టనున్న ఐదు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ పాఠశాలలో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రెండు, మూడు వారాలకు ఒకసారి పనుల పురోగతిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షించాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

వైఎస్ఆర్ కాలనీలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి నిబంధనల ప్రకారం కొత్త విద్యుత్ మీటర్లు అందించేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కాలనీలో ఇళ్లలో నివసిస్తున్న వారికి ఇంటి పన్ను ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఎవరూ అక్రమంగా విద్యుత్ వినియోగించ కూడదని, ప్రతి ఇంటికి సరైన విద్యుత్ మీటర్ ఏర్పాటు చేయడంతో పాటు ఇంటి పన్ను ధృవీకరణ పత్రం కూడా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. కాలనీలో నివసించే ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారం విద్యుత్ సేవలను వినియోగించుకునేలా చూడాలన్నారు.

2023లో మంజూరైన డబుల్ బెడ్‌రూం ఇళ్లకు సంబంధించి ఇంకా పెండింగ్‌లో ఉన్న సమస్యలను గుర్తించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అంశాలపై సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, సంబంధిత అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీ చేయనైనది.
🏠 Home