Banner
Watermark
ఐదేండ్లుగా సమాచారం ఇవ్వని "జిల్లా అధికారులు"
📅 06 February 2026, 02:29 PM ✍️ admin
News Image
జగిత్యాల జిల్లా ( బుగ్గారం ) :
ఐదేండ్లుగా సమాచారం ఇవ్వని "జిల్లా అధికారులు"
కమీషన్ ఆదేశాలతో కదిలిన "జగిత్యాల జిల్లా యంత్రాంగం"
డిపివో కార్యాలయానికి నోటీసులు జారీ
రెండు రోజుల్లో అర్జీ దారుడు కోరిన సమాచారం ఇవ్వాలని ఆదేశాలు
జగిత్యాల జిల్లా ( బుగ్గారం ) :
జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో కూడా సమాచార అధికారులు గత ఐదేండ్ల నుండి అర్జీదారులు కోరిన సమాచారం ఇవ్వడం లేదని అధికారికంగా తేలింది. 2022 మే 17న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీఐ ద్వారా అర్జీదారుడు చుక్క గంగారెడ్డి సమాచారం కోరారు.ఏండ్లు గడిచినా సంబంధిత అధికారులు అట్టి సమాచారం ఇవ్వక పోవడం వలన ఆయన తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ ను ఆశ్రయించారు. బాధ్యులైన జిల్లా అధికారులకు సమాచార కమీషన్ నోటీసులు జారీ చేస్తూ గత 2025 అక్టోబర్ 27న హైద్రాబాద్ లోని సమాచార కమీషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తూ అట్టి విచారణకు జిల్లా అధికారులు ఎవ్వరు కూడా హాజరు కాలేదు. ఆగ్రహించిన సమాచార కమీషన్ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కు అప్పీల్ కేసు నం. 14352/ఎస్.ఐ.సి. - పి.వి.ఎస్.ఆర్. /2022 ద్వారా ఆర్డర్ జారీ చేశారు. షోకాజ్ నోటీసుల ద్వారా అర్జీ దారుడు కోరిన సమాచారం ఇవ్వక పోవడానికి, కమీషన్ ఎదుట విచారణకు హాజరు కాకపోవడానికి గల కారణాలు తెలుపుతూ సంజాయిషీ ఇవ్వాలని అట్టి ఆర్డర్ లో ఆదేశించారు.సమాచార కమీషన్ ఆర్డర్ తో జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం కదిలొచ్చింది. ఈ మేరకు ఈ నెల 4న జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలోని ప్రజా సమాచార అధికారికి ఉత్తర్వుల నం. ఎఫ్.2/578/2022 ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో అర్జీదారుడు చుక్క గంగారెడ్డి కోరిన సమాచారంను సమర్పించ వలసిందిగా ఆ నోటీసులో ఆదేశించారు.జిల్లా అధికారులు అవినీతికి పాల్పడి, అత్యంత బాధ్యత గల వారి విధులను దుర్వినియోగ పరచి, చట్టాలను, న్యాయ స్థానాల జడ్జిమెంట్ లను సైతం ఉల్లంఘిస్తున్నారని సామాజిక కార్యకర్త, ప్రముఖ ఉద్యమ కారుడు చుక్క గంగారెడ్డి ఆరోపించారు. సమాచార హక్కు చట్టం ద్వారా తాను కోరిన సమాచారంలను 2021 నుండి ఇప్పటి వరకు అధికారులు ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికీ వందలాది ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన ఆరోపించారు. న్యాయ స్థానాలను ఆశ్రయిస్తే తప్పా... ఈ జిల్లా యంత్రాంగం స్పందించడం లేదన్నారు. సాక్షాత్తు జిల్లా అదనపు కలెక్టర్ విచారణ జరిపిన ఆర్టీఐ కేసుల్లో కూడా ఫలితం లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా పరిపాలన కొనసాగించాల్సిన కలెక్టరేట్ పరిస్థితే ఇలా ఉంటే.... ఇక మిగతా కార్యాలయాలు, మండల, గ్రామ స్థాయి అధికారుల పని తీరు ఎలా ఉంటుందో ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతోందని ఆయన వివరించారు. ఇప్పటికైనా జిల్లా పాలనాధికారులు స్పందించి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని ఆయన సూచించారు. ఆర్టీఐ దరఖాస్తులకు వెంటనే కోరిన సమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ ప్రజా వాణిలో ఇచ్చిన ప్రజా విజ్ఞాపనలకు కూడా మోక్షం కలిగేలా చూడాలన్నారు.
🏠 Home