మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ
ఆరోగ్య మహిళ ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోండి
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మహిళలు, పిల్లల సంక్షేమానికి, అభివృద్ధికి శుక్రవారం సభ ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రామడుగు మండలం తిరుమలపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ జరిగింది. ఈ సభకు హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే వారి కుటుంబం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహిళల సంక్షేమానికి ఆరోగ్య మహిళ కార్యక్రమం ప్రవేశపెట్టి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని సర్కారు ఆసుపత్రిలో నిర్వహించే ఆరోగ్య మహిళ ద్వారా ముందస్తుగా వ్యాధులను గుర్తించి నయం చేయించుకోవచ్చని అన్నారు. శుక్రవారం సభలోను మహిళలు వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు పొందవచ్చని సూచించారు. శుక్రవారం సభ ద్వారా మహిళల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శిశువుల సంరక్షణ, పిల్లల సంపూర్ణ ఎదుగుదలకు పోషకాహారం, వైద్య న్యాయ సలహాలు వంటివి వివరిస్తున్నామని అన్నారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రైవేట్ లో డబ్బు వృధా చేసుకోవద్దని సూచించారు. అవసరమైన వారికి వైద్య సిబ్బంది ఇంటికి సైతం మాత్రలు తెచ్చి ఇస్తారని తెలిపారు. అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలను చేర్పించడం ద్వారా చదువుతోపాటు పోషణ పై దృష్టి సారిస్తారని అన్నారు. లోప పోషణను నివారించేందుకు అంగన్వాడీలో అన్ని చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు నాలుగుసార్లు ఏ.ఎన్.సి పరీక్షలు, ఖరీదైన టీపా స్కానింగ్ వంటివి ఉచితంగా చేసి మందులు అందజేస్తారని తెలిపారు. గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలని కోరారు. తిరుమలాపూర్ గ్రామంలో ప్రభుత్వ వైద్య సేవలను ఎక్కువ శాతం మంది వినియోగించుకోవడం మంచి విషయమని తెలిపారు. గ్రామంలో 30 సంవత్సరాల దాటిన వాళ్లు 800 మంది ఉండగా 127 మంది బీపీ మందులు, 58 మంది షుగర్ గోలీలు ప్రభుత్వ ఆసుపత్రి నుండి స్వీకరిస్తున్నారని తెలిపారు. గ్రామానికి చెందిన ఇద్దరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెలివరీ అయ్యారని తెలిపారు.