ఫెర్టిలైజర్ యాప్ సేవలు రైతులు వినియోగించుకోవాలి జిల్లాలో ఎరువులకు కొరత లేదు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
తంగళ్ళపల్లి, ఫిబ్రవరి - 19
రైతులు ఎరువుల కోసం పడే ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్ సేవలు వినియోగించుకోవాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు..
తంగళ్ళపల్లిలోని గ్రోమోర్ ఎరువుల షాప్ లో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఫెర్టిలైజర్ యాప్ ద్వారా ఎందరు రైతులు ఎరువులు బుకింగ్ చేసుకున్నారు? ఎందరు తీసుకువెళ్లారో ఆరా తీసి.. రిజిస్టర్లు పరిశీలించారు.
యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేసిన రైతుల వివరాలను రిజిస్టర్లలో తనిఖీ చేశారు. షాప్ లో నిన్న రాత్రి స్టాక్ వివరాలు, ఈ రోజు ఉదయం స్టాక్ వివరాలు పరిశీలించారు. అలాగే గోడౌన్ లో ప్రస్తుతం ఉన్న ఎరువుల నిలువలను అక్కడ ఉన్న సిబ్బందితో లెక్కింపజేసి సరి చూసారు.
అనంతరం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లా డుతూ.. రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్ రైతులు డౌన్ లోడ్ చేసుకోవాలని, దాని ద్వారానే ఎరువులు బుకింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని ఫెర్టిలైజర్ షాప్ లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద వద్ద రైతులకు సహాయం అందించేందుకు హెల్ప్ డెస్క్, ఒక సహాయకుడు ఉంటారని పేర్కొన్నారు. జిల్లాలోని రైతులందరూ యాప్ లో యూరియా బుక్ చేసుకుని తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం తమ పరిధిలోని అన్ని ఎరువుల షాపుల్లో తనిఖీ చేయాలని సూచించారు. యాప్ డౌన్ లోడ్, బుకింగ్ విషయంలో రైతులకు అందుబాటులో ఉండి.. సేవలు అందించాలని ఆదేశించారు.
జిల్లాలో ఈ నెల 1 వ తేదీ నుంచి ఈరోజు వరకు 92 వేల 735 సంచుల యూరియా వచ్చిందని, యాప్ ద్వారా జిల్లాలోని 84 వేల 68 మంది రైతులు ఎరువుల కోసం బుకింగ్ చేసుకున్నారని ఇంచార్జి కలెక్టర్ తెలిపారు.
79 వేల 948 మంది కొనుగోలు చేయగా, ఇంకా 11వేల 694 నిలువ ఉందని, 740 మంది రైతులు యూరియా కోసం బుకింగ్ చేసుకుని ఇంకా తీసుకువెళ్ల లేదని వివరించారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు.
పరిశీలనలో ఏడీఏ ప్రదీప్, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు తదితరులు ఉన్నారు.