పిల్లలకు అర్థమయ్యే విధంగా ఏఐ బోధన చేయాలి … జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
మంథని, ఏప్రిల్ - 29:పిల్లలకు అర్థమయ్యే విధంగా ఏఐ బోధన చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
మంథనిలోని జడ్పీహెచ్ఎస్ (బాలికలు) పాఠశాలలో నిర్వహిస్తున్న ఏఐ శిక్షణ తరగతులను , వయోవృద్ధుల కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన డ్రాయింగ్‌లను కంప్యూటర్‌లోకి మార్చి, ఏఐ సాయంతో యానిమేషన్‌గా రూపొందించిన విధానాన్ని కలెక్టర్ ఆసక్తిగా వీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, విద్యార్థులకు ఏఐపై పూర్తి అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు మరింత సమయం కేటాయించి, పిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాలని సూచించారు. భవిష్యత్ పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని తెలిపారు.
రోబోటిక్స్ శిక్షణ ఎప్పుడు ప్రారంభమవుతుందనే అంశంపై కలెక్టర్ ఆరా తీసి, త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
విద్యాశాఖ స్టార్టప్ “సూపర్ టీచర్” తో సమన్వయం చేస్తూ మంథనిలో “సూపర్ సమ్మర్” పేరుతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందులో 70 మంది విద్యార్థులు నమోదు చేసుకుని రెండు బ్యాచ్‌లలో శిక్షణ పొందుతున్నారని తెలిపారు.
మంథని అనంతరం రామగుండం, పెద్దపల్లి ప్రాంతాల్లో కూడా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను విస్తరించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
అనంతరం మంథనిలోని వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్, ప్రభుత్వం వయవృద్ధులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని అందులో భాగంగా మన జిల్లాలో సుల్తానాబాద్ ప్రాంతంలో వృద్ధుల ఆశ్రమం నిర్మించామని అన్నారు.
వయోవృద్ధులు సమయాన్ని ఉల్లాసంగా గడిపేందుకు వీలుగా డే కేర్ సెంటర్ మంథనిలో ఏర్పాటు చేశామని, ఈ సెంటర్ కు రెగ్యులర్ గా 100 మంది పైగా వృద్ధులు వస్తూ దీనిని వినియోగించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. డే కేర్ సెంటర్లో వృద్ధులు కోసం మరిన్ని ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళ ,శిశు సంక్షేమ శాఖ అధికారి వేణు గోపాల్,ఐటీ శాఖకు చెందిన టీ ఫైబర్ ప్రత్యేక అధికారి జే.ఎస్. రాహుల్ తదితరులు పాల్గొన్నారు
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది