ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
మే 02
జనగామ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధ్యానం కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
శనివారం, జిల్లాలోని లింగాల ఘనపురం మండలంలోని చీటూరు, కుందారం గ్రామ పంచాయతీల పరిధిలో గల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్రాల్లో జరుగుతోన్న కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించి, రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కేంద్రాల్లో టోకెన్ల జారీ, తూకం, తేమ పరీక్షలు సరైన విధంగా వేగంగా జరుగుతున్నాయా? అనే విషయాలను పరిశీలించారు.
ధాన్యం బస్తాల లోడింగ్, అన్‌లోడింగ్ పనులు వేగంగా పూర్తయ్యేలా తగిన హమాలీలు, వాహనాల ద్వారా సకాలంలో సంబంధిత మిల్లులకు తరలించాలని, ఎటువంటి ఆలస్యం కాకుండా చూడాలని, రైతులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి రైతు, ధ్యానం కొనుగోళ్ల వివరాలను వెంటనే ట్యాబ్‌లో నమోదు చేసి, చెల్లింపులు 48 గంటల లోగా జరిగేలా చూడాలన్నారు.
అదే విధంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున కేంద్రాల్లో మౌలిక వసతులను సక్రమంగా ఉండేలా చూసుకోవాలని, రైతులు, కేంద్ర నిర్వాహకులు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటిని వెంటనే పరిష్కరించేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
రైతుల శ్రేయస్సే లక్ష్యంగా కొనుగోలు కేంద్రాల నిర్వహణ ఉండాలని కేంద్ర నిర్వాహకులకు తెలిపారు.
ఈ తనిఖీలో సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.