ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి
రాజన్న సిరిసిల్ల, మే-12 ధాన్యం, మొక్కజొన్న పంట కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల పై సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, దానసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సమీక్ష నిర్వహించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్రతి ప్రైవేట్ గోదామును అవసరమైతే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని, అవసరమైన అన్ని చట్టాలను వినియోగించి నిల్వ సదుపాయాలను పెంచాలని సూచించారు. కమ్యూనిటీ హాళ్లు, రైతు బజార్లను తాత్కాలిక షెడ్లుగా వినియోగించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీలు, ఉన్నత స్థాయి పోలీసు అధికారులు, రవాణా శాఖ అధికారులు కొనుగోలు ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని, అవసరమైన వాహనాల ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
జిల్లాలో స్థానిక హమాలీలను 100 శాతం వినియోగించు కునేలా కార్యాచరణ రూపొందించాలని, ఎక్కడా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హమాలీలు అధిక మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తే వారి లైసెన్సులను రద్దు చేయాలని, అవసరమైన పోలీసు సహకారం తీసుకోవాలని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల ధాన్యం రైస్ మిల్లులకు చేరిన తర్వాత రైతులకు కోతలు జరుగుతున్నాయని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని సీఎం స్పష్టం చేశారు.
పంట రవాణా కోసం ఖాళీగా ఉన్న అన్ని వాహనాలు, ట్రాక్టర్లు, డీసీఎంలను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. తడిసిన ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ప్రతి రైస్ మిల్లుకు కొనుగోళ్ల పర్యవేక్షణ కోసం సమర్థవంతమైన అధికారిని నియమించాలని, ఆయా అధికారులు ప్రతి రోజూ నివేదికలు పంపించాలని సీఎం ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి వచ్చే ప్రతికూల వార్తలకు రిజాయిండర్లు క్రమం తప్పకుండా మీడియాకు పంపించాలని సూచించారు.
ప్రతి రోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కొనుగోళ్ల పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు. కొనుగోళ్ల అంశాన్ని తేలికగా తీసుకునే అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం వాహనాలు ఇవ్వని ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ యాసంగి సీజన్‌లో తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 25 లక్షల 78 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల వద్ద 11 లక్షల 52 వేల టన్నుల ధాన్యం పెండింగ్‌లో ఉందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపుల కోసం ఇప్పటివరకు రూ. 3,873 కోట్లను బ్యాంకుల ద్వారా విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 18 కోట్ల 68 లక్షల గన్నీ సంచులను అందుబాటులో ఉంచామని, ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్లు హమాలీలు, రవాణా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే ఫీడ్‌బ్యాక్ అందేలా వ్యవస్థ ఉండాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు చెల్లింపులు వేగంగా జరిగేలా ట్యాబ్ ఎంట్రీలు వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, యాసంగి సీజన్‌లో భారీగా మొక్కజొన్న దిగుబడి వచ్చిందని, రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం, మొక్కజొన్న తెలంగాణలోకి రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన బందోబస్తు, విజిలెన్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షాల సూచనలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ కొనుగోళ్ల వేగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కజొన్న కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే ఒక నెల అత్యంత కీలకమని, రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగి, ఎకరానికి సగటున 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం రాష్ట్ర మంత్రివర్గం రూ. 4,178 కోట్లను ఆమోదించిందని తెలిపారు.
ఇప్పటివరకు ప్రభుత్వం ద్వారా 8 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు జరగగా, ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించిన తర్వాత ప్రైవేట్ వ్యాపారులు కూడా అధిక ధరలకు మరో 6 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. మొత్తం 14 లక్షల 90 వేల మెట్రిక్ టన్నుల నిల్వ అవసరం ఉండగా ఇప్పటికే 10 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని సిద్ధం చేసినట్లు చెప్పారు.
అవసరమైన గన్నీ సంచులు అందుబాటులో ఉంచామని, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా సరఫరాలో కొంత అంతరాయం ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులు స్వయంగా గన్నీ సంచులు తీసుకువస్తే డీబీటీ ద్వారా చెల్లింపులు చేస్తున్నామని పేర్కొన్నారు.
హమాలీ చార్జీలను ఒక్కో సంచికి రూ. 8.50కు పెంచినట్లు చెప్పారు. అవసరమైన రవాణా వాహనాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
సమావేశంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, డీసీఎస్ఓ బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ కుమార్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.