Banner
Watermark
48 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభం కోసం తాత్కాలిక నియామకాలు
📅 03 June 2026, 01:49 PM ✍️ admin
News Image
పెద్దపల్లి, జూన్ 03: తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు మరియు రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకులు, సమగ్ర శిక్ష, తెలంగాణ, హైదరాబాద్ వారి ఉత్తర్వుల మేరకు పెద్దపల్లి జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి నూతనంగా 48 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి జి. శారదా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ 48 ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన 10 నెలల గౌరవ వేతనంతో ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు (Pre-Primary Instructors), ఆయాల (Ayahs) నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్మీడియట్ (10+2) లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలని, ప్రారంభ బాల్య విద్య లేదా ప్రాథమిక బోధనలో అర్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు. ఆయా పోస్టుకు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొన్నారు. ఎంపికలో అభ్యర్థులకు సంబంధిత ప్రీ-ప్రైమరీ పాఠశాల ఉన్న ఆవాసం, అదే గ్రామ పంచాయతీ , అదే మండలం , అదే జిల్లా క్రమంలో ప్రాధాన్యత కల్పించబడుతుందని తెలిపారు.

నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, మాజీ సైనికులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుందని వివరించారు. అర్హతలు కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులతో పాటు విద్యార్హత, వయస్సు, నివాస ధృవీకరణ తదితర సంబంధిత సర్టిఫికెట్ల ప్రతులను జతచేసి, సంబంధిత ప్రీ-ప్రైమరీ పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు 2026 జూన్ 9వ తేదీ సాయంత్రం వరకు సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి జి. శారదా కోరారు.

ప్రీ-ప్రైమరీ విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.
🏠 Home