పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని.. అందులో భాగంగా శాఖల వారీగా సమస్యలు పరిష్కరిస్తూ అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ చిత్రమిశ్రా పేర్కొన్నారు. శనివారం గంగాధర మండలం పాపాయ పల్లిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా
చొప్పదండి నియోజకవర్గం స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి డిసిసి అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్, నియోజకవర్గస్థాయి క్లస్టర్ ఆఫీసర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డిఓ మహేశ్వర్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. స్త్రీ శిశు సంక్షేమం, స్థానిక సంస్థలు, ఇందిరమ్మ ఇల్లు, ప్రజావాణి సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. జిల్లా, మండల, గ్రామస్థాయి భారీగా దరఖాస్తులు పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు వివరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అధికారులంతా సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్రభుత్వ పథకాలు పొందిన, పొందుతున్న లబ్ధిదారుల వివరాలు వివరించారు. రైతు బీమా, కళ్యాణి లక్ష్మి, రైతు భరోసా, మహాలక్ష్మి, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, చేయూత పెన్షన్లు , అంగన్వాడి కేంద్రాల సేవలు, ఆయిల్ ఫామ్ సాగు వివరాలు వివరించారు.
ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ
పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నట్లు వివరించారు. గతంలో రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ఇచ్చేవారని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నబియ్యం ఇస్తూ పేదల కడుపు నింపుతుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు, గృహలక్ష్మి, అర్హులకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల జారీ, తదితర పథకాలు.. త్వరలో ప్రవేశ పెట్టే పథకాలను వివరించారు
గత ప్రభుత్వం వరి వేసుకుంటే ఊరేనని చెప్పిందని.. సన్న రకాలకు 500 బోనస్ ఇస్తూ రైతులకు అండగా ఉంటున్నామని వివరించారు. దేశంలో ఎక్కడలేని విధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశామని.. విద్యారంగాన్ని తీర్చిదిద్దేందుకు నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి జేఎన్టీయూ ఇస్తే.. నేడు మరిన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.
నియోజకవర్గంలోని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
నియోజకవర్గంలోని ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల పాదాలు కడుగుతానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు.
నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తయితే చొప్పదండితోపాటు వేములవాడ నియోజకవర్గాలకు సాగునీటి కష్టాలు తప్పుతాయన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు భూసేకరణకు 23.5 కోట్లు మంజూరు చేశారని.. మరో 20 కోట్లు త్వరలో విడుదల అవుతాయని పేర్కొన్నారు.
వచ్చే ఐదేళ్లలో నియోజకవర్గానికి మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా పాలన చేస్తున్నట్లు వివరించారు
చొప్పదండి ప్రజలు మాకు దేవుళ్లతో సమానమని నన్ను గెలిపించినందుకు చివరి రక్తపు బొట్టు వరకు ప్రజాసేవ చేస్తానని పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది రావద్దు..
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్, ఇతర అధికారులను కోరారు. క్షేత్రస్థాయిలో కేంద్రాలను తనిఖీ చేసి వాస్తవాలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. తాను కూడా కేంద్రాలను తనిఖీ చేస్తానని.. గత ప్రభుత్వంలో మాదిరి ఇష్టానుసారం తూకంలో కోతలు విధించొద్దని ఆదేశించారు.
సర్పంచులు ఊరి అభివృద్ధి పై దృష్టి సారించండి.
ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని.. ఎన్నికల తరువాత ఊరి అభివృద్ధి పై దృష్టి సారించాలని నూతన సర్పంచులకు సూచించారు.
ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు