విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయమైన సేవలు అందించడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడమే టీజీఎన్‌పీడీసీఎల్ ప్రధాన లక్ష్యమని సంస్థ సీఎండీ శ్రీ కర్నాటి వరుణ్ రెడ్డి పునరుద్ఘాటించారు.
శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన తంగళ్లపల్లి మండలంలోని రాంచంద్రాపూర్ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో ఫీడర్ల వారిగా ఏర్పాటు చేసిన బ్రేకర్ లను ప్రారంభించారు. దీని వలన పరిశ్రమలకు , గృహాలకు, వ్యవసాయానికి ప్రత్యేక ఫీడర్లు అందుబాటులోకి వచ్చాయని తద్వారా విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు . అనంతరం నేరెళ్ల విద్యుత్ ఉపకేంద్ర పరిధిలో ఏర్పాటు చేయనున్న 1.4 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించి, పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని చెప్పారు .
తదుపరి సిరిసిల్ల స్టోర్స్‌ను తనిఖీ చేసిన సీఎండీ, సామగ్రి నిల్వలు, నాణ్యత ప్రమాణాలు, నిర్వహణ విధానాలను సమీక్షించారు. వర్షాకాలంలో సామగ్రి చెడిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు . అవసరం మేరకు క్షేత్ర స్థాయిలో ట్రాన్స్ఫార్మర్ల సామర్ధ్యం పెంపు చేపట్టాలని కోరారు . అనంతరం కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఏఈలు, ఏడీఈలు, డీఈలు, ఏఓలతో సమావేశమై విద్యుత్ సరఫరా, నిర్వహణ, వినియోగదారుల సేవలు, భద్రతా ప్రమాణాల అమలుపై సమీక్షించారు . ఈ సమీక్షలో నాణ్యమైన విద్యుత్ అందించే దిశగా టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని దిశా నిర్ధేశం చేశారు . రెవెన్యూ లక్షాలను మెరుగుపరుచుకోవాలని , ఆర్థికంగా మరింత బలోపేతం దిశగా అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు . కాలిపోయిన , పని చేయని మీటర్లను మార్చాలని చెప్పారు. కొత్త సర్వీసుల మంజూరు వేగవంతం చేయాలని చెప్పారు . వ్యవసాయ సర్వీసులు , టిజి ఐ పాస్ లో సర్వీసులు యుద్దప్రాతిపదికన రిలీజ్ చేయాలన్నారు .
అందరం కలసి కట్టుగా పని చేసి వినియోగదారులకు మెరుగైన , నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించే లక్షంగా నిబద్ధత్థో పనిచేయాలని పిలుపు నిచ్చారు .
తదనంతరం విద్యుత్ శాఖలో డిజిటల్ సేవలను మరింత విస్తరించేందుకు రూపొందించిన ఎల్టీఎంటీ (LTMT) యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా మీటర్ల మంజూరు , క్షేత్రస్థాయి కార్యకలాపాల పర్యవేక్షణ, సేవల నిర్వహణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని ఆయన తెలిపారు.
రుద్రవరం 33/11 కేవీ ఉపకేంద్రాన్ని సందర్శించిన సీఎండీ, జిల్లాలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ (RTFMS) ను ప్రారంభించారు. ఈ వ్యవస్థ ద్వారా విద్యుత్ సరఫరా స్థితిగతులను తక్షణమే పర్యవేక్షించి లోపాలను వేగంగా గుర్తించి పరిష్కరించవచ్చని పేర్కొన్నారు.
అలాగే అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సేవల పునరుద్ధరణను వేగవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ERT) వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ప్రకృతి వైపరీత్యాలు, విద్యుత్ అంతరాయాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఈ వాహనం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ టి . వేణు మాధవ్ , డి.ఈ సిరిసిల్ల అంజయ్య , డి.ఈ వేములవాడ వెంకట రమణ డివిజన్ స్థాయి అధికారులు, ఇంజనీర్లు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.