పెద్దపల్లి, అక్టోబర్-24: పెద్దపల్లి జిల్లాలో యువతకు ఉపయోగపడే కార్యక్రమాలను ప్రోత్సహించడంతో పాటు, జిల్లాలోని చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను వెలుగులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు.
యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, సైన్యం, పారామిలిటరీ దళాల్లో ఉద్యోగాలు సాధించేందుకు అభ్యర్థులకు అవసరమైన సన్నద్ధత కల్పించడం, జిల్లాలోని చారిత్రక ప్రదేశాల విశిష్టతను ప్రజలకు తెలియజేయడం వంటి లక్ష్యాలతో చేపడుతున్న కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.
శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని (ఐడీఓసీ) తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అగ్నివీర్, ఎస్‌ఎస్‌సీ జీడీ అభ్యర్థుల కోసం నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరం, “మన జిల్లా – మన ఖిల్లా” కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న సీతమ్మలోద్ది ట్రెక్కింగ్‌కు సంబంధించిన రెండు పోస్టర్లను ఆవిష్కరించారు.
అగ్నివీర్, ఎస్‌ఎస్‌సీ జీడీ అభ్యర్థులకు ఉచిత వైద్య శిబిరం
అగ్నివీర్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, నవంబర్ 12 నుంచి ప్రారంభం కానున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులతో పాటు ఎస్‌ఎస్‌సీ జీడీ అభ్యర్థులకు ప్రయోజనం కల్పించేలా యువశక్తి – పెద్దపల్లి ఆధ్వర్యంలో అక్టోబర్ 31న ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు.
రన్నింగ్, ఇతర శారీరక పరీక్షల అనంతరం నిర్వహించే వైద్య పరీక్షల్లో చిన్నపాటి ఆరోగ్య సమస్యల కారణంగా అభ్యర్థులు అనర్హులు కాకుండా, ముందుగానే లోపాలను గుర్తించి అవసరమైన వైద్య సలహాలు, చికిత్స పొందేందుకు ఈ శిబిరం దోహదపడనుంది. భారత సైన్యం, పారామిలిటరీ దళాల్లో ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
పెద్దపల్లి బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు, శిబిరంలో పాల్గొనదలచిన అభ్యర్థులు పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, మరిన్ని వివరాల కోసం 7780543055, 9182691655 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.
నవంబర్ 1న సీతమ్మలోద్ది ట్రెక్కింగ్
జిల్లాలోని చారిత్రక, ప్రకృతి ప్రదేశాల విశిష్టతను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు యువతలో ఫిట్‌నెస్, పర్యావరణ పరిరక్షణపై ఆసక్తిని పెంపొందించేందుకు “మన జిల్లా – మన ఖిల్లా” కార్యక్రమంలో భాగంగా నవంబర్ 1న సీతమ్మలోద్ది ప్రాంతంలో ట్రెక్కింగ్ నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 250 మంది రన్నర్స్, వాకర్స్ తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
సీతమ్మలోద్ది ప్రాంతంలో సుమారు 1,000 నుంచి 1,200 సంవత్సరాల నాటి ప్రాచీన చిత్రాలు కలిగిన గుహలు, ఆదిమానవుల జీవన ఆనవాళ్లు ఉండటం ఈ ప్రాంత ప్రత్యేకతగా నిలుస్తోంది.
ట్రెక్కింగ్‌లో భాగంగా పిడుగుతొర్ర, భీమన్న దేవాలయం వంటి చారిత్రక, ప్రకృతి ప్రదేశాలను సందర్శించి వాటి విశిష్టతను తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు.
ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, మన జిల్లా చరిత్ర, వారసత్వ సంపదను ప్రత్యక్షంగా తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
యువతతో పాటు ప్రజలు చారిత్రక ప్రదేశాల పరిరక్షణలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.
మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా యువతలో చైతన్యం
సీతమ్మలోద్ది ట్రెక్కింగ్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పించనున్నారు.
“YES FOR LIFE – SAY NO TO DRUGS” నినాదంతో యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని సూచిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో డి.ఎం.ఓ. ప్రవీణ్ రెడ్డి,మాజీ సైనికుడు, అంతర్జాతీయ పర్వతారోహకుడు లెంకల మహిపాల్ రెడ్డి, ఫొటోగ్రాఫర్లు రవీందర్ రెడ్డి, శీలం అనిల్, తదితరులు పాల్గొన్నారు.
---------‐--------------------------------‐-----------------------
జిల్లా పౌర సంబంధాల అధికారిణి , పెద్దపల్లి చే జారీ చేయనైనది.